దేని కొరకు - శ్రీ శ్రీ - మహా ప్రస్థానం

వేళకాని వేళలలో,
లేనిపోని వాంఛలతో-
దారికాని దారులలో,
కానరాని కాంక్షలతో -
దేని కొరకు పదే పదే
దేవులాడుతావ్‌?
ఆకటితో, అలసటతో,
ప్రాకులాడుతావ్‌?
శ్రీనివాసరావ్‌!
శ్రీనివాసరావ్‌!
దేనికోసమోయ్‌?
నడిరాతిరి కడలివద్ద
హోరుగాలి ఉపశ్రుతిగ,
నీలోనే నీవేదో
ఆలపించుతావ్‌?
ఆవ్యక్తపు టూహలతో
ఆలపించుతావ్‌?
జగమంతా నిదుర మునిగి
సద్దణగిన నడిరాతిరి
నీలోనే నీవేదో
ఆలకించుతావ్‌?
శ్రీనివాసరావ్‌!
శ్రీనివాసరావ్‌!v