Public · Protected · Private
దేశమును ప్రేమించుమన్నా gurajada
Type: Public  |  Created: 2012-12-21  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • దేశమును ప్రేమించుమన్నా
    మంచి అన్నది పెంచుమన్నా;
    వొట్టిమాటలు కట్టిపెట్టోయి
    గట్టిమేల్ తలపెట్టవోయి!

    పాడి పంటలు  పొంగి పొర్లే
    దారిలో నువు పాటుపడవోయి;
    తిండి కలిగితె కండ కలదోయి
    కండకల వాడేను మనిషోయి!

    యీసురోమని మనుషులుంటే
    దేశమే గతి బాగుపడునోయి?
    జల్లుకొని కళలెల్ల నేర్చుకు
    దేశి సరుకులు నించవోయి!

    ఆన్ని దేశాల్ ప్రకమ్మవలెనోయి;
    డబ్బు తేలేనట్టి నరులుకు
    కీర్తి సంపద లబ్బవోయి!

    వెనక చూసిన కార్యమే మోయి?
    మంచి గతమున కొంచెమేనోయి
    మందగించక ముందు అదుగేయి
    వెనుకపడితే నెనకేనోయి!

    పూను స్పర్ధను విద్యలందే
    వైరములు వాణిజ్య మందే;
    వ్యర్ధ కలహం పెంచబోకోయి
    కత్తి వైరం కాల్చవోయి!

    దేశాభిమానం నాకు కద్దని
    వట్టి గొప్పలు చెప్పుకోకోయి;
    పూని యేదైనాను వొక మేల్
    కూర్చి జనులకు చూపవోయి!

    ఓర్వలేమి పిశాచి దేశం
    మూలుగులు పీల్చేసెనోయి;
    ఒరుల మేలుకు సంతసిస్తూ
    ఐకమత్యం నేర్చవోయి!

    పరుల కలిమికి పొర్లి యేడ్చే
    పాపికెక్కడ సుఖం కద్దోయి?
    ఒకరి మేల్ తన మేలనెంచే
    నేర్పరికి మేల్ కొల్ల్లలోయి!

    స్వంత లాభం కొంత మానుకు
    పొరుగు వాడికి  తోడు పడవోయి
    దేశమంటే మట్టి కాదోయి
    దేశమంటే మనుషులోయి!

    చెట్టపట్టాల్ పట్టుకుని
    దేశస్థులంతా నడవవలె నోయి,
    అన్నదమ్ముల వలెను జాతులు
    మతములన్నీ మెలగవలెనోయి!

    మతం వేరైతేను యేమోయి?
    మనసు నొకటై మనుషులుంటే
    జాతమన్నది లేచి పెరిగి
    లోకమున రాణించునోయి!

    దెశమనియెడి దొడ్డ వృక్షం
    ప్రేమలను పూలెత్తవలెనోయి
    నరుల చెమటను తడిసి మూలం
    ధనం పంటలు పండవలెనోయి!

    ఆకులందున అణగి మణగీ
    కవిత  కోయిల పలకవలె నోయి
    పలుకును విని దేశమందభి
    మానములు మొలకెత్తవలనోయి!

    2012-12-21 01:55
This blog is frozen. No new comments or edits allowed.