పుష్ప విలాపం pushpa vilapam

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితాఖండం పుష్పవిలాపం

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకోరకె త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.


తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి
I should not miss this one!!

గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.