దేశ భక్తి

దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా;
వొట్టిమాటలు కట్టిపెట్టోయి .. గట్టిమేల్ తలపెట్టవోయి!
పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ గలదోయి కండగల వాడేను మనిషోయి!
యీసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి?
జల్లుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి!
ఆన్ని దేశాల్ క్రమ్మవలెనోయి దేశి సరుకులు నించవోయి!
డబ్బు తేలేనట్టి నరులుకు కీర్తి సంపద లబ్బవోయి!
వెనక చూసిన కార్యమే మోయి? మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి వెనుకపడితే నెనకేనోయి!
పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్య మందే;
వ్యర్ధ కలహం పెంచబోకోయి కత్తి వైరం కాల్చవోయి!
దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి;
పూని యేదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి!
ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయి;
ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయి!
పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్ల్లలోయి!
స్వంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయి
దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి!
చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలె నోయి,
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి!
మతం వేరైతేను యేమోయి? మనసు నొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి!
దెశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయి!
ఆకులందున అణగి మణగీ కవిత కోయిల పలకవలె నోయి
పలుకును విని దేశమందభి మానములు మొలకెత్తవలనోయి!
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయజయ జయ సస్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ 2
జయ దిశాంత గత వకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా
జయ జయ 2
-దేవులపల్లి కృష్ణ శాస్త్రి
పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా పిల్లలారా

మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు ....ఉన్నాడు పొంచుకున్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు ....ఉన్నాడు అతడున్నాడు
పిల్లల్లారా పాపల్లారా ||

భారతమాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతులేని ప్రేమలే
పిల్లల్లారా ప్రేమలే రేపటి భారత పౌరుల్లారా
పిల్లల్లారా పాపల్లారా ||

భారదేశం ఒకటే ఇల్లు భరతమాతకు మీరే కళ్ళు మీరే కళ్ళు మోరే కళ్ళు
జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి
బడిలో బయట అంతా కలిసి భారతీయులై మెలగండి
కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి ....వీడని బంధం వేయండి.
పిల్లల్లారా పాపల్లారా ||
-----------దాశరధి
శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పాఱిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు వెలసె నిచ్చట ఆదికావ్యము చిందె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు పాదుసుమ్మిది చెల్లెలా!

విసిన బంధుర వృక్షనాటిక ఉపనిషన్మదు వొలికె నిచ్చట
విపుల తత్వమ్ము విస్తరించిన వినుల తలమిదె తమ్ముడా!
సూత్ర యుగముల సుద్ధవాసన క్షాత్ర యుగముల శౌర్యచండిమ
దిత్రదాస్యమునీ చరిత్రల చెఱిగిపోయెనె చెల్లెలా!

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తీ
పాలతీయని బాలభారత పదము పాడర తమ్ముడా!
నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల విందుగ
కవిత లల్లిన కాంతి హృదముల గారైవింపవె చెల్లెలా!

దేశగర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా!
పాండవీయుల పదును కత్తులు నుండి మఱసిన మహితి
రణకథ కండగల చిక్కని తెఱంగుల కలిసి పాడవె చెల్లెలా!

లోకంతకు కాక పెట్టిన కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవ పదముల చేర్చిపాడర తమ్ముడా!
తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి
భంగపడని తెలుగు నాధుల పాట పాడవె చెల్లెలా!