ఏవి తల్లీ! శ్రీ శ్రీ
జగద్గురు శంకరుడెచ్చట ?
ఏవితల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు ?
కాళిదాసు మహా కవీంద్రుని
కవనవాహినిలో కరంగిన
ఉజ్జయినినేడెక్కడమ్మా
ఉంది? చూపించు ?
షాజహాన్ అంత:పురములో
షట్పదీశింజానమెక్కడ:
ఝాన్సీ లక్ష్మీదేవియెక్కిన
సైంధవంనేడేదితల్లీ ?
రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్జల రోచులేవీ.:
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధను లెక్కడమ్మా?
ఎక్కడమ్మాకృష్ణరాయని
బాహు జాగ్ర ద్బాడబాగ్నులు ?
బాలచంద్రునిబ్రహ్మనాయని
ప్రాణవాయువులేవితల్లీ ?
జగద్గురువులు, చక్రవర్తులు,
సత్కవీశులు, సైన్యనాధులు,
ఆనవతులగు మహారాజ్ఞులు
కానరారేమీ ?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయినజాడలేవీ ?
ఏవితల్లీ: నిరుడు కురిచిన
హిమ సమూహములు ?