సదసత్సంశయం శ్రీ శ్రీ

ఆలోలము లాలోచన
లేవేవో నాలోపల
ప్రాలేయచ్ఛాయలవలె
తారాడగ కోరాడగ
పేరు పేరువరసలతో
పిలిచి ప్రశ్న వేస్తున్నా
ఈ తెగని సమస్యను భే
దించువారలెవరో అని
ఎన్నోసందేహాలూ
ఎన్నోసంతాపాలూ
జీవితంపుచిక్కుముడులు
విడవెంతగ సడలించిన
ఈ సృష్టికి ఏమర్ధం
మానవునికి గమ్యమేది
ఒక సకలాతీత శక్తి
ఉన్నట్టా లేనట్టా
నిరంతరం ఘోషించే
నీరనిధిని పిలిచినాను
ఆస్తి నాస్తిరూపమైన
ఆకాశము నడిగినాను
మహాకవుల గ్రంథాలను
మనసుపెట్టి పఠించాను
ప్రవ్రజితుల ముముక్షువుల
భావాలనే స్మరించాను
యుగయుగాలుతరలెగాని
ప్రశ్న ప్రశ్నలాగున్నది
అలలు కదిసిమరలి చనగ
శిలమాత్రం మిగిలినట్టు
జగదీశరు డతడెవరో
అగపడితే బాగుండును
ఏమీ యిదిసామీ అని
నిలవేస్తా కడిగేస్తా
కవి హృదయపు కనుమలలో
గర్జించిన పర్జన్యం
పెనుచీకటి తిరుగుబాటు
బీభత్సపుమెరుపుదాడి
కనులముందుచిత్రించే
గతిలేని , జనాల బాధ
కడుపు తరుక్కొనిపోయే
కన్నీళ్ళ విషాదగాథ
కరువులలోవరదలలో
కటిక దరిద్రుల అవస్థ
కవితలోన కథలలోన
కట్టాలనితలచినపుడు
ఈ విశాల జగతినుంచి
ఏమిటి నే కోరినాను
ఒక జానెడు సానుభూతీ
ఒక దోసెడుతిరుగుబాటు
జ్ఞానులుబోధిస్తూ బ్ర
హ్మానందమవాజ్మాధస
విశదమనీ అనుభవైక
వేద్యమనీనుడివినారు
జపంవల్ల తపంవల్ల
ప్రపంచాన్ని మరచిపోయి
భగవంతునిధ్యానంలో
పడిపొమ్మని పలికినారు
మంచిచెడ్డలను కొలిచే
మానదండమట దైవం
ఈశరు డొకడే సత్యం
ఇతర సమస్తం మిథ్యట
ఇంద్రియాలదారా మన
కీ సత్యం తెలియదంట
విశాసం తప్పమనకి
వేరే సాక్ష్యం లేదట
అగుపించనిదేదో ఒక
ఆత్మపదార్ధం కలదట
అన్నీపోవచ్చుగాని
అదిమాత్రం చావదంట
నిప్పు దాన్నికాల్చలేదు
ఛేదించగలేదు కత్తి
నీరు దాన్నిముంచలేదు
గాలి దాన్ని చెరపదంట
జన్మలనీ కర్మమనీ
చాలాదూరంవెళ్ళిన
ఆలోచనలన్నీ ఈ
ఆత్మచుట్టు అల్లినవే
ఏతదాత్మసరేషాం
సరత్రా ఆవరించి
సరసం తానే ఐ
శాసిస్తుం దంట జగతి
పుణ్యపాప నిర్ణేతలు
నీత్యవినీతిజ్ఞ విజ్ఞు
లస్తి నాస్తి విచికిత్సకు
లంతమందియేమన్నా
ఇదిమాత్రం నే నెరుగుదు
నెంతమందియేమన్నా
తథ్యం ప్రాణికి మృత్యువు
తప్పదు జీవికి వేదన
జడిగొల్పే దు:ఖంలో
తడియకుండగొడుగులేదు
ఆనందాలన్నీ తుద
కంతమొందు నొక సమాధి
మనుజునిలోమరణ భీతి
మదిలో దు:ఖానుభూతి
ఆలోచన లన్నిటికీ
ఆంతర్యంతో పునాది
ఎవరయ్యా ఎవరువారు
ఈశర పదజిజ్ఞాసువు
లెవరయ్యా ఎవరంటా
ఇదివరలో ఎవరువారు ?
ఉద్యోగపు ధర్మంలో
సద్యోం హశ్చర్యంలో
విటతాటపు బ్రతుకు గడిపి
రిటైరైన పోలీసులు.
నిత్య నిధువనక్రీడా
నృత్యంలో అలసిపోయి
జవసతా లుడిగిపోయి
సాధువైనవేశ్యామణి
నైకానోకహవిహారి
కాకంవలె దు:ఖరాత్ర
ఘూకంవలె సంచరించు
లోక దేషాగ్ని శీలి :
ఇంకా చెప్పాలంటే
ఎందరోమహానుభావులు
బ్రతుకునించిపారిపోయి
తమ వెనుకనే దాగువారు.
మరణమహాసముద్రాన
జీవితమొక దీపంలా
తమపాలిటి శాపంలా
తలపోసే ఫిలోఫర్లు
ఆహా మరి యింతేనా
అందమైన మన మనుగడ
మూడునాళ్ళ వింతేనా
జగమతుకుల బొంతేనా
మెదడన్నదిమనకున్నది
అదిసరిగా పనిచేస్తే
విశరహ: పేటికా వి
పాటనజరగక తప్పదు.
ప్రవక్ష్యామి గీతార్థే
న యన్నాడు కాళిదాసు
బహుశా అంతకుమించిన
క్థోనిజమే ఉండదేమొ
ఔను - అహింసను పోలిన
పరమో ధర్మమ్ము లేదు
(పరమో ధర్మం విరువకు
పరమ - అధర్మం అంటూ)
ఈవిల్‌,సిన్‌మొదలైన ప
దాలను వాడేటప్పుడు
న్యాయం ధర్మం నీతీ
త్యాదుల చర్చించేప్పుడు
ఎవరికి తోచిన అర్థం
వారలు చెప్పక తప్పదు
పరమార్థం సామాజిక
సామూహిక సదర్తన
కలడు కలండనెడువాడు
కలడోలేడో అంటూ
లోగడఒక ఏనుగు ఆ
లోచనలోపడిందట.
హౌరా హౌరీ మకరితో
పోరి నడుం జారి తుదకు
నాన్యధాస్తిశరణ మనుచు
దైన్యంతో నిలిచిందట
విహల నాగేంద్రునిమొర
విని - అప్పుడు కదలెనంట
ఆపన్న జనావనబిరు
దాంచితుడైనట్టి వేల్పు
చక్రంబుననక్రంబుసు
సంహరించి ఆ పిమ్మట
స్థల జలచరు లిరువురికీ
సాయుజ్య మొసంగెనంట
ఇదిజరిగిన కథకాదని
ఎవరో కల్పించిందని
ఇంచుక యోచించ గలా
డెవడైనాగ్రహిస్తాడు.
ఆ విషయమటుండనిచ్చి
అసలు సంగతికి వద్దాం
ఈ గజేంద్రమోక్షణకథ
ఏవిటి చెబుతుందిమనకు ?
నీ శక్తికి విలువలేదు
నీయత్నం పనికిరాదు
దైవబలం ఉందే అది
అమేయమూ, అజేయమూ :
అందుచేత నూరిపోయు
లొంగిపొమ్ము బేషరతుగ
అపుడాతని కృపచేత స
మస్తం సౌఖ్యాంత మగును.
పిరికితనంనూరిపోయు
పిట్ట కథలతోబానిస
మానసికతనగ్గించే
మన పూరుల నేమనాలి?
రాచరికపు రోజుల్లో
ఎగుడుదిగుడు సమాజాన
పాలక వర్గాధిక్యం
నిలబెట్టేపూనికతో
మనిషినిలా తగ్గిస్తూ
మరోదాన్నిఉగ్గడించి
పరమాత్ముని పేరమత
ప్రవక్తలైనారు వారు
వాళ్ళ నెందు కనడంలే
ఇదిమనలోజీర్ణించిన
ముదితత్తం, ఈ సరికీ
వదలిపోని మురికిమందు