స్వప్నకాంత

ఓ.. అపురూపమా..
నేను నిన్ను కలగనే కాలంలో నువ్వే నా లోకం..
ఆ సమయం లో నువ్వెవరివో..
ఎందుకు నన్నిలా కలవరపెడుతున్నావో..
నాకేమీ అర్ధంకాదు..
ఆ క్షణంలో.. నిన్ను ఆశ్చర్యంగా..అమాయకంగా ..
అచేతనమై.. నీ అద్భుత సౌందర్యాన్ని
అదేపనిగా.. నిశ్చేష్టుడ నై
అలా చూస్తూ వుండిపోతాను..
నిన్ను చూస్తున్నంత సేపూ
నా హృదయం ఆనందంతో..
చెప్పలేని పారవశ్యంతో..
ఈ లోకాన్నే మరచిపోతుంది..
అసలు నన్నెందుకు నా గాఢ నిద్ర నుంచి
నన్ను మేలుకోలుపుతావో...
ఎందుకు నీకై నన్ను కలవరింప జేస్తావో..
తెలియదు నాకు..
నీ చిత్రమైన నడవడికి అర్ధం తెలుసుకోవాలని
నేను పడే తపనా.. ఆరాటం.. ఆవేదనా..
అంతా.. ఇంతా కాదు..
నిరంతర జీవన పోరాటం లో విసిగి వేసారి అలసి..
కలత చెందినా మనస్కుడనై..
నిద్రిస్తున్న నన్ను..
వెన్ను తట్టి లేపినట్టు.. మేలుకోలుపుతావు..
నేను ఉల్కిపడి లేచి నిన్ను గమనించే లోగా
ఎక్కడో.. దూరంగా చిత్రంగా అడుగులు వేస్తూ..సాగిపోతుంటావు ..
అంతులేని నీ సౌందర్యాకర్షణ లో పడి
నేను వివశుడనై నిన్ను వీక్షిస్తూ ఉండగానే..
మళ్ళీ నీ నిర్లక్ష్య వైఖరితో..
నన్ను మరింత పిచ్చివాడ్ని చేస్తావు..
నాలో ఏదో తెలియని ప్రేరణ కలిగిస్తావు..
నిన్ను ఏమని పిలవాలో తెలియక
నువ్వు ఎవరో తెలుసుకోవాలని
నేను నీ దగ్గరికి పరుగున చేరే లోగా..
ఒక్కసారిగా నాముందు నిలిచినా నీ రూపం
అస్పష్టమై.. అగోచరమై.. నిశ్శబ్దమై.. చీకటిలో కలిసిపోతుంది..
నన్ను ఒక్క క్షణం కలవర పెడుతుంది.
కానీ ప్రియతమా..
నా కనుపాపలలో ముద్రించుకు పోయిన
నీ దివ్య రూపాన్ని
కన్నీటితో బరువెక్కిన నా కనురెప్పలతో..
ఘాడంగా స్ప్రుశిస్తాను..
ఆ కన్నీటి తో నీ రూపాన్ని కడిగి..
మసకల్లోనుంచి స్పష్టం చేసుకుని ..
మూసినా నా కళ్ళ లోనే..
నీ రూపం కరిగి పోయే వరకూ చూసుకొంటాను..
నిన్నే తలచు కుంటూ
మళ్ళీ అదో.. నిద్రలోకి జారుకొంటాను..